: ఇండియాలోని యాచకుల్లో విద్యాధికులు... పీజీ గ్రాడ్యుయేట్లు కూడా!
భారత్ లో యాచకాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జనాభా లెక్కల్లోని వివరాల ప్రకారం, ఇండియాలో 3.72 లక్షల మంది అడుక్కుని తినేవారుండగా, అందులో 21 శాతం మంది కనీసం ఇంటర్ పాసైన వారున్నారు. వేల సంఖ్యలో ప్రొఫెషనల్ డిప్లమో హోల్డర్లు, ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. వీరిలో అత్యధికులు తాము చదివిన చదువు సరైన ఉద్యోగాన్ని అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ వృత్తిలో కొనసాగుతున్నారట. "నేను పేదవాడిని. కానీ నిజాయతీ పరుడిని. మరింత డబ్బు కోసమే రోజూ అడుక్కుంటా. రోజుకు రూ. 200 వరకూ సంపాదిస్తున్నా. అంతకుముందు ఓ ఆసుపత్రిలో బాయ్ గా పనిచేశాను. అప్పుడు రోజుకు రూ. 100 మాత్రమే లభించేది" అని ఇంటర్ పాస్ అయి, ఇంగ్లీషులో మాట్లాడుతూ డబ్బులడిగే 45 ఏళ్ల దినేష్ కోబాభాయ్ వ్యాఖ్యానించాడు. 30 మంది యాచకులం ఓ గ్రూప్ గా ఉంటామని, ఓ ఉదారవాది రోజూ తమకు టీ ఇచ్చి వెళ్తాడని చెబుతున్నాడు. ఇక బీకాం ఫెయిలై ఇదే వృత్తిలో ఉన్న సుధీర్ బాబూలాల్ రోజుకు రూ. 150 వరకూ సంపాదిస్తున్నాడు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి ఎంకామ్ పాసైన దశరధ్ ది సైతం ఇదే వృత్తి. ఇలా ఎన్నో వేల మంది సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆరోపిస్తూ, యాచక వృత్తిని కొనసాగిస్తున్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యకు జనాభా లెక్కల గణాంకాలే నిదర్శనమని సామాజిక వాదులు విమర్శిస్తున్నారు.