: నెల రోజుల పరిచయంతో యువతిని మోసం చేసిన ఘనుడు
మెదక్ జిల్లాలో మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం ఫోన్లో పరిచయం అయిన వ్యక్తి మాటలు నమ్మిన యువతి మోసపోయి డబ్బు పోగొట్టుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీలత అనే యువతికి కిషోర్ బాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె బ్యాంకు వివరాలు తెలుసుకున్న కిషోర్, ఖాతాల్లో అధికంగా డబ్బు ఉంటే బ్యాంకులు కొంత సొమ్ము వసూలు చేస్తాయని భయపెట్టాడు. ఎకౌంట్ లో డబ్బులు తీసి వేస్తుండాలని నమ్మబలికాడు. తాను సహకరిస్తానని చెబుతూ, బ్యాంకుకు వచ్చి ఆమెతో రూ. 4.28 లక్షలు డ్రా చేయించి వాటితో ఉడాయించాడు. శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, ఈ తరహా మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ప్రజలకు సలహా ఇస్తున్నారు.