: అందమైన అమ్మాయి... ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్!: రక్షణ శాఖ సిబ్బందికి ఐఎస్ఐ తీపి వల
భారత రక్షణ శాఖకు చెందిన అత్యంత కీలక సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పన్నుతున్న వ్యూహాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. దేశ రక్షణ శాఖకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఏడాదిగా ఇతరులకు చేరవేస్తున్నాడన్న కారణంగా ఎయిర్ ఫోర్స్ లో లీడింగ్ క్రాఫ్ట్స్ మన్ గా పనిచేస్తున్న కేకే రంజిత్ నిన్న అరెస్టయ్యాడు. వాస్తవానికి అరెస్టయ్యేదాకా తానెంత తప్పు చేస్తున్నాడో అతడికి కూడా తెలియదట. సమాచారం ఇస్తున్న వ్యక్తి... ఎందుకోసం ఇస్తున్నాడో, ఎవరికి ఇస్తున్నాడో తెలియకుండానే ఐఎస్ఐ పక్కా వ్యూహం రచించింది. దీని గుట్టును భారత నిఘా వర్గాలు రంజిత్ అరెస్ట్ తో రట్టు చేశాయి. తొలుత ఓ అందమైన అమ్మాయి ఫేస్ బుక్ లో ప్రత్యక్షమవుతుంది. అప్పటికే తామెంచుకున్న భారత రక్షణ శాఖ అధికారికి ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ పంపుతుంది. సదరు రిక్వెస్ట్ కు ఓకే చేసే అధికారులతో చిన్నగా సదరు అమ్మాయి మాట కలుపుతుంది. బ్రిటన్ కేంద్రంగా వెలువడే ఓ పత్రికకు ఎడిటర్ నని చెబుతుంది. సదరు పత్రికలో కథనం కోసం భారత రహస్యాలు కావాలని కోరుతుంది. ఫ్రీగా ఏమీ వద్దులే, సదరు సమాచారానికి భారీగానే రుసుము చెల్లిస్తామని చెబుతుంది. దాంతో మనోళ్లు అమ్మాయి హస్కీ వాయిస్ కు అప్పటికే ఫ్లాట్ అయి ఉంటారు కాబట్టి, ఇక ఆమె అడిగిన సమాచారాన్నంతా ఇట్టే ఇచ్చేస్తారు. రంజిత్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బ్రిటన్ పత్రికకు భారత రక్షణ శాఖ రహస్యాలతో పనేమిటన్న చిన్న ఆలోచన కూడా రాకుండా ఒక్కో రిపోర్ట్ కు రూ.30 నుంచి 35 వేల దాకా రంజిత్ తీసుకున్నాడు. ఫేస్ బుక్ లో కలిసిన అమ్మాయితో తొలుత చాటింగ్, ఆ తర్వాత ఈ-మెయిళ్లు, ఆ తర్వాత ఏకంగా ఫోన్ సంభాషణలు నెరపిన రంజిత్, ఆమె ఏదడిగినా ఇచ్చేశాడు. భటిండా ఎయిర్ బేస్ కు చెందిన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో పాటు విస్తీర్ణం, రన్ వే పొడవు, అక్కడి మరిన్ని కీలక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేశాడు. అసలు ఆమె ఏమడిగినా రంజిత్ కు చిన్న అనుమానం కూడా రాలేదు. ఆ తరహాలో సదరు యువతి ఐఎస్ఐ తరఫున రాయబారం నడిపింది. రంజిత్ వద్ద తీసుకున్న రిపోర్టులన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా ఐఎస్ఐకి చేరవేసింది. తీరా నిన్న అరెస్టయిన తర్వాత జరిగిన వ్యవహారాన్నంతా పోలీసులకు చెప్పిన రంజిత్, పోలీసులు సదరు వ్యూహం వెనుక ఉన్న గుట్టు విప్పడంతో నిశ్చేష్టుడయ్యాడట. ఇలా బాగా చదువుకున్న అమ్మాయిలను, బ్రిటిషర్ల యాసలో మాట్లాడగలిగే వాక్చాతుర్యం ఉన్న అమ్మాయిలను నియమించుకుంటున్న ఐఎస్ఐ భారత రహస్యాలను ఇట్టే సేకరిస్తోంది. ఒక్క రంజితే కాక మరింత మంది రక్షణ శాఖ అధికారులు ఈ తరహా తీపి వలకు పడిపోయి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.