: ప్యారిస్ అటాక్ మాస్టర్ మైండ్ ను మట్టుబెట్టేశాం... అమెరికా మిలిటరీ ప్రకటన
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై జరిగిన ఉగ్రదాడి కీలక సూత్రధారి, ఐఎస్ కీలక నేత చర్రాఫీ ఎల్ మౌదాన్ ను మట్టుబెట్టేశామని అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఇటీవల సిరియాపై కొనసాగించిన వైమానిక దాడుల్లో భాగంగా మౌదాన్ తో పాటు ఐఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా చనిపోయారని బాగ్దాద్ లోని అమెరికా మిలిటరి అధికార ప్రతినిధి స్టీవ్ వారెన్ చెప్పారు. తాము వరుసగా చేస్తున్న దాడుల కారణంగా మొన్నటిదాకా బాగా బలపడ్డ ఐఎస్ ఉగ్రవాదులు వెనకడుగు వేయక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. తమ దాడుల్లో మౌదాన్ తో పాటు ఆ సంస్థ పెద్ద తలకాయలుగా భావిస్తున్న రవాంద్ దిల్షార్ తాహెర్, ఖలీల్ అహ్మద్ అలీ ఆల్ వాయిస్, అబూ అనాస్, యూనిస్ ఖలాష్, మిథాక్ నజీమ్, అక్రమ్ ముహ్మద్ సాద్ ఫారిస్, తషీన్ అల్ హయాలీ తదితరులను మట్టుబెట్టామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఐఎస్ చీఫ్ బాగ్దాదీని కూడా కడతేరుస్తామని వారెన్ పేర్కొన్నారు.