: ఆ ‘అమ్మ’ కావాలంటే.. గంటకు రూ.2,600 చెల్లించాలి!


‘అమ్మ’ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే, అంత నిస్వార్థంగా, కల్మషం లేకుండా, ప్రేమ, ఆప్యాయతలను కురిపించే అమ్మ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు కాబట్టి. కన్నతల్లిలా.. అంత చేయలేకపోయినా.. ఎంతో కొంత చేసే వారు లేకపోలేదు. అమ్మ దగ్గర లేని లోటును తాము తీరుస్తామంటూ ‘నీడ్ ఏ మామ్’ అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థను న్యూయార్క్ కు చెందిన నైనా కెనియల్లీ అనే 63 సంవత్సరాల మహిళ ప్రారంభించింది. ఈ సంస్థను ఎందుకు స్థాపించాల్సి వచ్చిందనే విషయమై ఆమె మాట్లాడుతూ, ‘నేను యోగ తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. ఇక్కడికి యువతీ యువకులు వస్తుంటారు. తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామన్న ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే ‘నీడ్ ఏ మామ్’ అనే సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఉద్యోగాల నిమిత్తం న్యూయార్క్ నగరానికి వచ్చే యువతీ యువకుల సంఖ్య బాగానే ఉంటుంది. వారిలో చాలామంది తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. మంచి అయినా, చెడు అయినా ఏ విషయమైనా మన అన్న వాళ్లతో పంచుకుంటే బాగుంటుంది. ఆ ఆనందానికి యువత దూరమైపోతున్నారు. అలాంటి వారికి ఎంతో కొంత ఊరట కలిగించేందుకు ఈ సంస్థను మొదలు పెట్టాను. ఎవరైనా మా సంస్థలో సంప్రదించి ‘అమ్మ’ కావాలని కోరితే..ఎప్పుడు, ఎక్కడికి రావాలో తెలుసుకుని అక్కడికి పంపుతాము. కాకపోతే, గంటకు రూ.2,600 ఛార్జి చేస్తాము. అయితే, ఒక కొడుకుకి తల్లి చేసే పనులేవీ అమ్మగా అక్కడికి వెళ్లిన వ్యక్తులెవ్వరు చేయరు. కేవలం వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడటం, కష్టసుఖాలను తెలుసుకోవడం.. సలహాలు, సూచనలు ఇవ్వడం, తల్లిలా ప్రేమ పంచడం చేస్తారు’ అని నైనా పేర్కొంది. ‘అమ్మ’ సేవలకు మంచి డిమాండ్ ఉందని, త్వరలోనే తమ సేవలను మరిన్ని నగరాల్లో విస్తరించే ఉద్దేశ్యముందని నైనా పేర్కొంది.

  • Loading...

More Telugu News