: ఇండోర్ లో కరోడ్ పతి కానిస్టేబుల్... 32 ఏళ్ల సర్వీసులో కోట్లు కూడబెట్టిన వైనం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కరోడ్ పతి కానిస్టేబుల్ వెలుగుచూశాడు. ఇండోర్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అరుణ్ సింగ్ అవినీతి, అక్రమాలపై పలు ఫిర్యాదులు అందుకున్న మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు నిన్న రంగంలోకి దిగారు. ఇండోర్ తో పాటు రేవా, సత్నాలోని అతడి ఇళ్లపై ఏకకాకంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లోకాయుక్త అధికారులకు దిమ్మతిరిగే రీతిలో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. 32 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న అతడికి ఇప్పటిదాకా వేతనం రూపేణా రూ.50 లక్షల మేర సర్కారీ సొమ్ము అంది ఉంటుంది. అయితే అతడి స్థిర, చరాస్తులను లెక్కలేసిన లోకాయుక్త అధికారులు అతడు కోటీశ్వరుడిగానే ఎదిగాడని తేల్చేశారు. సోదాల్లో భాగంగా ఐదు భారీ భవంతులు, నాలుగు విలాసవంతమైన కార్లు, రెండు కేజీల వెండితో పాటు కొంతమొత్తంలో బంగారు అభరణాలు కూడా లభ్యమయ్యాయి.