: మీరు జర్నలిస్టులా... థూ!: విజయకాంత్
జర్నలిస్టులపై డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసి, వివాదంలో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే, డీఎండీకే పార్టీ ఆధ్వర్యంలో నిన్న రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, 2016లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? అని ఓ జర్నలిస్టు విజయకాంత్ ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, జయ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది... ఆ తర్వాత ఉన్నట్టుండి మీడియా ప్రతినిధులపై విజయకాంత్ నిప్పులు చెరిగారు. ఇదే ప్రశ్న జయను అడిగే దమ్ము మీకు ఉందా? అని మండిపడ్డారు. ఆమె గురించి మాట్లాడాలంటే మీకు భయం... అసలు మీరు జర్నలిస్టులేనా? అంటూ 'థూ' అని ఉమ్మేశారు. ఈ ఘటనను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. విజయకాంత్ వైఖరిని తప్పుబట్టాయి. జర్నలిస్టులకు విజయకాంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.