: యువజంటకు ముంబై పోలీసుల బహిరంగ దండన...సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
రోడ్డుపై ఓ మూలగా ఆగి ఉన్న ఆటోలో కూర్చున్న ఓ యువ జంట ఊసులాడుకుంటోంది. అంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆటో నుంచి దిగమని యువజంటకు హుకుం జారీ చేశారు. దీంతో కాస్తంత బెరుకుగానే ఆటో దిగిన యువజంటలోని యువకుడిని నడిరోడ్డుపై పోలీసులు చితకబాదారు. పోలీసుల దెబ్బలు తాళలేక ఆ యువకుడు అక్కడే కూలబడినా, ఖాకీలు కనికరించలేదు. తలపై మొట్టికాయలేశారు. ఇక ఊహించని ఘటనతో భయంతో బిక్కచచ్చి నిలబడ్డ యువతిపై పోలీసులు బూతు పురాణం అందుకున్నారట. చెడామడా తిట్టేసిన పోలీసులు మళ్లీ కనిపిస్తే మక్కెలిరగతంతామంటూ హెచ్చరికలు జారీ చేసి, ఆ యువజంటను అక్కడ నుంచి పంపించివేశారు. మోరల్ పోలీసింగ్ పేరిట ముంబైలోని ఉల్హాస్ నగర్ పోలీసులు సాగించిన ఈ బహిరంగ దండన మొత్తాన్ని రికార్డు చేసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీస్ ఇన్ స్పెక్టర్ మోహన్ వాగ్మారే యువజంటదే తప్పంటూ వాదించారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర భంగిమల్లో కూర్చుంటున్న సదరు జంటపై స్థానికులు ఫిర్యాదు చేస్తేనే తాము రంగ ప్రవేశం చేశామని ఆయన చెప్పుకొచ్చారు.