: నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరికిన ఆఫ్ఘనిస్తాన్ వాసులు
ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచుకుంటున్న ఆఫ్ఘన్ వాసులు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను తలలు నరికి చంపారు. ఈ ఘటన తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని అచిన్ జిల్లా పరిధిలోని ఓ ప్రధాన రహదారిపై జరిగిందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో నాన్గార్హర్ ప్రావిన్స్ పై పట్టు కోసం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, తాలిబాన్ వర్గాలకు చెందిన స్థానిక మిలీషియా సభ్యులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘన్ పార్లమెంటులో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న హాజీ జహీర్ కు అనుచరులుగా ఉన్న పదుల కొద్దీ మిలీషియా సభ్యులు ఉగ్రవాదులను బంధించి, ఆపై వారిని నడి రోడ్డుపై హత్య చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఆఫ్ఘన్ భద్రతా దళాలకు సంబంధం లేదని, విచారణకు ఆదేశించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.