: డబ్బులెక్కడని ప్రశ్నించిన రుత్వికులు... పరువు తీయద్దని వేడుకున్న యాగ నిర్వాహకులు!
కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రుత్వికులు తమకు డబ్బులు చెల్లించేంత వరకూ యాగ పరిసమాప్తికి సహకరించబోమని కొద్దిసేపు భీష్మించడంతో గందరగోళం నెలకొంది. యాగం మొత్తం పొగచూరి రుత్వికులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఉదయం ఓ అరగంట పాటు యాగానికి ఆటంకం కలుగగా, మిగతా బ్రాహ్మణులంతా లోపలికి వచ్చిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి యాగ నిర్వహణకు వచ్చిన వారు లోపలికి రాలేదు. వీరెందుకు రాలేదని తెలుసుకున్న నిర్వాహకులు మైకుల్లో పదేపదే వారిని పిలవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం కాదని, అందాల్సిన దక్షిణ అందుతుందని, యాగాన్ని ఆటంక పరిచి బ్రాహ్మణుల పరువు పోయే పనులు చేయవద్దని హిందీ, కన్నడ భాషల్లో నిర్వాహకులు వేడుకున్నారు. లోపలి వచ్చి యాగ పరిసమాప్తికి సహకరించాలని కోరారు. వారిని తీసుకువచ్చిన వారిని పిలిచి సర్దిచెప్పించారు. నిర్వాహకుల నుంచి వచ్చిన హామీతో రుత్వికులు యాగం కొనసాగించారు.