: చంద్రబాబును ఆలింగనం చేసుకున్న కేసీఆర్
అయుత మహా చండీయాగం జరుగుతున్న వేదిక వద్ద ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. కొద్ది సేపటి క్రితం చంద్రబాబు కాన్వాయ్ ఎర్రవల్లికి చేరుకోగా, వేదిక వరకూ తన వాహనంలో వచ్చిన చంద్రబాబు, ఆపై మేళతాళాలతో స్వాగతం మధ్య, నేటి యాగపు సంప్రదాయ పసుపు రంగు వస్త్రం కప్పుకుని నడుచుకుంటూ ప్రధాన యాగస్థలికి వెళ్లారు. ఆయన రాకను గురించి ముందుగానే తెలుసుకున్న కేసీఆర్, స్వయంగా చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్, ఆపై వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆపై అక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శనం చేయించి, విశిష్ట అతిథుల వేదికపై చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా యాగం జరుగుతున్న తీరును చంద్రబాబుకు కేసీఆర్ వివరించారు. చంద్రబాబు వెంట ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రి గంటా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.