: ఆంధ్రోళ్లు వెళ్లొచ్చాకే గ్రేటర్ ఎన్నికలు: నాయిని
హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్లు సంక్రాంతి పండగకు తమ సొంత ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాతనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు జరిపిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రోళ్లు అటెళ్లిపోగానే ఎన్నికలు జరుపుతామంటూ, కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రాంత ప్రజలపై టీఆర్ఎస్ వివక్ష చూపుతోందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారం, వారి రాజకీయ లబ్ధి కోసమేనని అన్నారు. కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య బంధువు నంది మాధవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నాయిని మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద డివిజన్లలో విజయం టీఆర్ఎస్ పార్టీదేనని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న నమ్మకముందని అన్నారు.