: చంపేస్తున్న చలిపులి... ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!
తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకూ పడిపోయాయి. ఈ రోజు ఉదయం 8 గంటలైనా పలు నగరాలు, పట్టణాలను పట్టిన మంచు తెరలు వీడలేదు. ఆదిలాబాద్ లో అత్యంత కనిష్ఠంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చలికి తాళలేక ముగ్గురు చనిపోయారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని లంబసింగిలో 7, మెదక్ లో 8, రామగుండంలో 9, చింతపల్లి, నిజామాబాద్ ప్రాంతాల్లో 10, హకీంపేటలో 11, నందిగామలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారంతో పోలిస్తే, ఆదివారం హైదరాబాద్ లో 5 డిగ్రీల మేరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉదయం 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరాది నుంచి వస్తున్న చలి గాలుల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల పాటు శీతలగాలుల తీవ్రత కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.