: మోదీ నాకు న్యాయం చేస్తారని భావిస్తున్నా: కీర్తి అజాద్
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే కాకుండా... అంతర్గతంగా బీజేపీలో కూడా చిచ్చు రేపింది. డీడీసీఏ నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ ఆరోపించిన నేపథ్యంలో, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను అజాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1996 ఎన్నికల సమయంలో మోదీని కలిశానని... అప్పట్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారని తెలిపారు. అప్పట్లో మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని... తన అభ్యర్థనను విని, తనకు ఆయన న్యాయం చేస్తారనే భావిస్తున్నానని చెప్పారు. కీర్తి అజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల పార్టీ సీనియర్లు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు.