: నాడు ఆర్కే శర్మ, నేడు సజ్జన్ జిందాల్!... భారత్, పాక్ ప్రధానుల భేటీ వెనక వీరిదే కీలక భూమిక?


11 ఏళ్ల క్రితం భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాకిస్థాన్ లో పర్యటించారు. నాడు ఆ దేశ ప్రధానిగా ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫే ఉన్నారు. నాటి ఇరు దేశాల ప్రధానుల భేటీ వెనుక రియలన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ ఆర్కే శర్మ కీలకంగా వ్యవహరించారన్న వార్తలు వినిపించాయి. తాజాగా నిన్న రష్యా, అఫ్ఘనిస్థాన్ లలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ లోని లాహోర్ లో ల్యాండయ్యారు. గంటల ముందుగా నిర్ణయించుకున్న ఈ పర్యటనతో మోదీ ఇరు దేశాలకే కాక ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేశారు. అయితే ఈ భేటీ వెనుక కూడా భారత పారిశ్రామికరంగానికి చెందిన ఓ దిగ్గజమే ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. సదరు వ్యాపారవేత్త వేరెవరో కాదు, జిందాల్ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్! దేశీయ ఉక్కు వ్యాపారంలో అగ్రగ్రామిగా ఎదిగిన సంస్థకు చెందిన సజ్జన్ జిందాల్ చొరవతోనే ఇరు దేశాల ప్రధానుల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఇటీవల సార్క్ సదస్సు కోసం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అక్కడ జిందాల్ గ్రూపునకు చెందిన ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారట. ఈ సందర్భంగా మోదీ, నవాజ్ ల మధ్య స్వల్ప భేటీ జరిగిందని ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ ప్రమాణస్వీకారానికి ఢిల్లీ వచ్చిన నవాజ్ షరీఫ్... జిందాల్ ఇంటిలో టీ పార్టీకి హాజరయ్యారు. రాజకీయ నేతగానే మనకు తెలిసిన నవాజ్ షరీఫ్... పాక్ లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. 1939లో షరీఫ్ తండ్రి ముహమ్మద్ షరీఫ్ స్థాపించిన చిన్న స్టీల్ ఫ్యాక్టరీ తదనంతర కాలంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. స్టీల్ ఫ్యాక్టరీలతో పాటు 24 చక్కెర కర్మాగారాలు కూడా షరీఫ్ కుటుంబానికి ఉన్నాయి. ఇదిలా ఉంటే, జిందాల్ గ్రూపు ఆధ్వర్యంలోని జేఎస్ డబ్ల్యూ, జేఎస్ పీఎల్ తో పాటు భారత ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), మాన్నెట్ ఇస్పాట్ లు... అఫ్ఘనిస్థాన్ లో అఫ్ఘన్ ఐరన్ అండ్ స్టీల్ కన్సార్టియం పేరిట కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీకి ముడి ఇనుమును పాక్ మీదుగా రోడ్డు మార్గం ద్వారా భారత్ నుంచి అఫ్ఘన్ కు చేర్చే విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వంతో జిందాల్ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిందాల్, షరీఫ్ ల మధ్య వ్యాపారపరమైన సంబంధాలు బలపడ్డాయి. ఇందులో భాగంగానే భారత్, పాక్ ల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లే విషయంలో జిందాల్ అమితాసక్తి కనబరుస్తున్నారు. నిన్న లాహోర్ ట్రిప్ పై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన కాసేపటికే జిందాల్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణకు పావులు కదుపుతున్న జిందాల్ మాత్రం ఈ విషయంపై నోరు విప్పడం లేదు.

  • Loading...

More Telugu News