: పాక్ ప్రధాని నవాజ్ ఆతిథ్యం అద్భుతం: ప్రధాని ట్వీట్స్
ఊహించని విధంగా కొద్ది గంటల ముందు పాకిస్థాన్ పర్యటనను ఖరారు చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి తిరిగివచ్చే క్రమంలో పాక్ నగరం లాహోర్ లో ల్యాండయ్యారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేరుగా విమానాశ్రయానికి వచ్చి మరీ మోదీకి ఘన స్వాగతం పలికారు. లాహోర్ శివారులోని రాయ్ విండ్ లోని నవాజ్ సొంతింటికి వెళ్లిన మోదీ, ఆయన మనవరాలి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నవాజ్ తల్లికి పాదాభివందనం చేశారు. దాదాపు రెండు గంటలకు పైగానే రాయ్ విండ్ లో మోదీ గడిపారు. ఢిల్లీ తిరిగివచ్చేసిన తర్వాత నవాజ్ ఆతిథ్యంపై మోదీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఆకాశానికెత్తేశారు. తనకు లభించిన స్వాగతం, వీడ్కోలు, నవాజ్ ఇంటిలో ఆతిథ్యం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిపై నవాజ్ చేసిన ప్రశంసలు తదితరాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నవాజ్ జన్మదినం, ఆయన మనవరాలి పెళ్లి ఒకేసారి జరగడంతో సంబరాలు ద్విగుణీకృతమయ్యాయని మోదీ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ తనకు పలికిన స్వాగతం, ఇచ్చిన వీడ్కోలుతో పాటు చేసిన మర్యాదలు మనస్సుకు హత్తుకున్నాయని తెలిపారు. నవాజ్ కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరంగా గడిచిందని పేర్కొన్నారు. అటల్ జీతో తనకున్న అనుబంధాన్ని నవాజ్ తనతో పంచుకున్న వైనాన్ని కూడా మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.