: ఎవరి శక్తి సామర్థ్యాలపై వారికి నమ్మకం ఉండాలి: సైనా నెహ్వాల్
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. అనంతరం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయ ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడి పిల్లలతో కాసేపు గడిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం ఉంటేనే బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తారని తెలిపింది. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సొంత శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉండాలని సైనా తెలిపింది. ఈ కార్యక్రమంలో సైనాతో పాటు ఏపీ క్రీడలు, యువజన శాఖ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ కూడా పాల్గొన్నారు.