: పాక్ తో స్నేహ హస్తాన్ని అందుకోవాలని మోదీ కోరుకుంటున్నారు: వెంకయ్య
పాకిస్థాన్ తో సత్సంబంధాల దిశగా ప్రధానమంత్రి అడుగులు వేశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ దేశంతో స్నేహ హస్తాన్ని అందుకోవాలని మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ లో తమ మంత్రిత్వశాఖ చేపట్టిన నిర్మాణాన్ని ప్రధాని ప్రారంభించారని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. వాజ్ పేయిని కలసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులందరూ శుభాకాంక్షలు తెలిపారన్నారు. డీడీసీఏ ఆరోపణలు పాతవేనని.. యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చినవేనన్న వెంకయ్య, ఆ ఆరోపణలపై విచారణ జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి క్లీన్ చిట్ కూడా లభించిందని తెలిపారు. అయితే ఆప్ తో కలిసి కాంగ్రెస్ మళ్లీ కొత్తగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న వెంకయ్య, దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్సేతర ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు ఆ పార్టీకి కొత్త కాదని ఆరోపించారు. మోదీని ఢీకొట్టడం కాంగ్రెస్ తరం కాదని స్పష్టం చేశారు. ప్రధానిని అడ్డుకుంటామన్న భ్రమలో కాంగ్రెస్ దేశ ప్రగతిని అడ్డుకుంటోందన్నారు. దేశాన్ని, పార్లమెంటును అవమానపరుస్తూ కాంగ్రెస్ అపఖ్యాతి మూటగట్టుకుంటోందని ధ్వజమెత్తారు.