: నాడు వాజ్ పేయి, నేడు మోదీ... 11 ఏళ్ల తరువాత పాక్ నేలపై భారత ప్రధాని!


దాదాపు 11 సంవత్సరాల క్రితం ఆనాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాకిస్థాన్ లో పర్యటించారు. నేడు ఆయన 91వ పుట్టిన రోజు. ఇదే రోజున పాకిస్థాన్ ప్రధాని తన 66వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇద్దరు నేతల పుట్టిన రోజులు కలవడం కాకతాళీయమే అయినా, మోదీ మాత్రం కాకతాళీయంగా పాకిస్థాన్ లో కాలుమోపుతున్నారని భావించలేం. ఆయన ముందుగానే ఈ విషయాన్ని ప్లాన్ చేసుకొని ఉండవచ్చని ఇప్పుడు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటులో ప్రసంగానికి ముందు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ, తన పాక్ పర్యటనపై వివరాలు తెలిపారు. షరీఫ్ ను విష్ చేసేందుకు ఆగనున్నట్టు తెలిపి, ఆయనకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆపై పార్లమెంటులో ప్రసంగిస్తూ, "కొన్ని దేశాలకు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు" అని పాక్ పేరు చెప్పకుండానే సునిశిత విమర్శలూ చేశారు. ఆపై మరి కొన్ని గంటల్లోనే పాక్ గడ్డపై కాలుమోపి సరికొత్త చరిత్రకు తెరలేపనున్నారు. వాస్తవానికి వచ్చే సంవత్సరం జరుగనున్న సార్క్ దేశాల సదస్సు మోదీ పాక్ తొలి పర్యటన కాగలదని అందరూ భావిస్తూ వచ్చారు. ఇటీవలే వాతావరణ మార్పుల సదస్సులో మోదీ, నవాజ్ లు చేతులు కలుపుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలు అటుంచితే, గడచిన 25 సంవత్సరాల వ్యవధిలో భారత ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి పాక్ లో పర్యటించింది మూడు పర్యాయాలు మాత్రమే. అందులో రెండు వాజ్ పేయి ఖాతాలో ఉన్నాయి. 1999లో అమృతసర్ నుంచి లాహోర్ కు బస్సు సర్వీసు ప్రారంభం కాగా, అందులో పాక్ వెళ్లి వచ్చిన వాజ్ పేయి, ఆపై మరోసారి 2004లో పర్యటించారు. అయితే, హిందుత్వాన్ని అణువణువూ పుణికిపుచ్చుకుని, పాక్ ను అమితంగా ద్వేషించే బీజేపీ నేతలు ఆ దేశంలో కాలుమోపడం మాత్రం కచ్చితంగా కాకతాళీయమే అనవచ్చేమో!

  • Loading...

More Telugu News