: మచ్చలేని మహానేత వాజపేయి 91వ జన్మదినం నేడు... కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం
భారతదేశం గర్వించదగ్గ మహానేతల్లో మాజీ ప్రధాని, బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజపేయి ఒకరు. ఆయన స్థానాన్ని ఆక్రమించడం ఇతర నేతలకు అంత సులభం కాదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు ఆయన 91వ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణాదేవి దంపతులకు అటల్ జన్మించారు. గ్వాలియర్ లోని లక్ష్మిబాయ్ కాలేజ్ లో డిగ్రీ చదివిన అనంతరం కాన్పూర్ లో ఎంఏ పూర్తి చేశారు. ఇదే సమయంలో లిటరేచర్, సైన్స్ పై కూడా ఆయన అవగాహన పెంచుకున్నారు. పొలిటికల్ సైన్స్, లా చదివిన వాజ్ పేయి తదనంతరం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. 1939లో ఆర్ఎస్ఎస్ లో చేరిన వాజపేయి... 1947లో పూర్తి స్థాయి ప్రచారక్ అయ్యారు. అంతకు ముందు 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, తన అన్న ప్రేమ్ తో కలిసి వాజపేయి అరెస్ట్ అయి, 23 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు తొలిసారిగా రాజకీయాలతో సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జన సంఘ్ అనే రాజకీయ పార్టీలో చేరారు. ఇది ఆర్ఎస్ఎస్ తో కలసి పనిచేసే ఒక సంస్థ. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఆ పార్టీలో ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా వాజపేయి బాధ్యతలు చేపట్టారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి జన సంఘ్ తరపున వాజపేయి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన వాగ్ధాటికి ముగ్దుడైన ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ... వాజపేయి ఏనాటికైనా భారత ప్రధాని అవుతారని ఊహించారు. మొత్తం మీద లోక్ సభకు తొమ్మిది సార్లు, రాజ్యసభకు రెండు సార్లు వాజ్ పేయి ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా వాజపేయి ఎదిగారు. 1977లో కొత్తగా ఏర్పడిన సంకీర్ణకూటమి జనతాపార్టీలో జనసంఘ్ ను విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో వాజపేయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. అయితే, 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జనసంఘ్, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సహచరులు, ముఖ్యంగా అద్వానీ, బైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకుని 1980లో వాజపేయి బీజేపీని ఏర్పాటు చేశారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1996 నుంచి 2004 మధ్య వాజపేయి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలను నిర్వహించారు. 1996లో కేవలం 13 రోజుల పాటే ప్రధానిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో బీజేపీ విఫలమయింది. రెండో పర్యాయం 1998-99లో 13 నెలల పాటు ప్రధానిగా వ్యవహరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. మరే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో లోక్ సభ రద్దయింది. అయితే, 1998లో పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించి, భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటారు వాజపేయి. ఆ తర్వాత 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్థిరమైన మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మూడోసారి ప్రధాని పీఠాన్ని వాజపేయి అధిరోహించారు. 2005లో క్రియాశీల రాజకీయాల నుంచి వాజపేయి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, వాజపేయిని రాజకీయ భీష్ముడిగా అభివర్ణించడం... వాజపేయి గొప్పదనానికి మరో కొలమానం. 2009లో వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్లు ఉండి, ఆ తర్వాత కోలుకున్నారు. మళ్లీ అదే సంవత్సరం ఆయన పక్షవాతానికి గురై, సరిగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మనుషులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకోవడం ఆవేదన కలిగించే అంశం. ప్రస్తుతం ఆయన మధుమేహంతో పాటు, డిమెంటియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనను సందర్శించడానికి ఎవరినీ అనుమతించడం లేదు. భారత రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా కీర్తిగాంచిన వాజపేయిని అనేక అవార్డులు వరించాయి. లోకమాన్యతిలక్ పురస్కారం, గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, పద్మభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. 2014లో భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సగౌరవంగా సత్కరించింది.