: ఆఫ్ఘన్ వాసులపై మోదీ వరాల జల్లు
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తదుపరి వరల్డ్ కప్ క్రికెట్ కు సన్నద్ధమయ్యే ఆఫ్ఘన్ జట్టుకు ఢిల్లీలో శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా ప్రాణాలను కోల్పోయిన అమరవీరుల పిల్లలకు ఉపకార వేతనాలను ఇండియా అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం 500 మంది చదువుకుంటున్న వారిని ఎంపిక చేసి జాబితా అందించాలని కోరారు. ఇండియా నుంచి వారి బ్యాంకుల్లోకి డబ్బులు వేస్తామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ యువత సాధికారతను సాధించడంలో ఇండియా సహకరిస్తుందని, వారు ఐటీ విద్యలో మరింత రాణించేందుకు కొత్త కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తామని, విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇండియాలో ఉపాధి చూపేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలకు మంచి రహదారులను నిర్మించాల్సి వుందని, అందుకు నిధులను దీర్ఘకాల రుణాల రూపంలో ఇచ్చేందుకు అభ్యంతరం లేదని మోదీ తెలిపారు. యువతకు మరింత నైపుణ్యం కోసం కావాల్సిన శిక్షణా కేంద్రాలను ఇండియా స్వయంగా ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాలూ సంయుక్తంగా మరిన్ని రహదారులను నిర్మించాల్సి వుందని, తద్వారా ఆఫ్ఘన్ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. సాల్మా ఆనకట్ట నిర్మాణానికి ఇండియా సహకరించిందని గుర్తు చేసిన ఆయన, త్వరలోనే విద్యుత్, నీరు ప్రజల అవసరాలకు వినియోగపడనున్నాయని, మరిన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సైతం భారత్ నిర్మిస్తుందని పేర్కొన్నారు.