: మనం ముందుకెళ్తున్నాం, ఇదే సాక్ష్యం: మోదీ


భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు పరస్పర సహకారంతో వృద్ధి పథంలో దూసుకెళ్లనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో భారత్ నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఇండియా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంటులోని ఒక బ్లాక్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టడాన్ని కొనియాడిన నరేంద్ర మోదీ, ఆయుధాలు వదిలి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన అద్భుత దేశం ఆఫ్ఘన్ అని, అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఉగ్రవాదం వేళ్లూనుకున్న అన్ని దేశాలకూ ఆఫ్ఘనిస్తాన్ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. "నేను 125 కోట్ల మంది భారతీయ స్నేహితుల ప్రతినిధిగా మీ ముందున్నాను. ఈ దేశపు ప్రజలు తమ ఓటుతో భవితవ్యాన్ని బంగారు బాట చేసుకునేలా ముందడుగు వేశారు. ఈ పార్లమెంటు భవనం రెండు దేశాలు, రెండు జాతుల మధ్య వారధిగా నిలుస్తుంది. ఇదే భవనం సాక్షిగా ఇరు దేశాల మధ్య ఆలోచనాత్మక సంబంధాలు బలోపేతం కానున్నాయి. ఆఫ్ఘన్ స్వావలంబన కోసం అవసరమయ్యే ప్రతి సహాయాన్ని అందించేందుకు ఇండియా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి గుర్తింపుగా ఈ భవంతి నిలవాలని కోరుకుంటున్నా. రెండు దేశాల ప్రజల మధ్యా హద్దులే లేని బంధముంది. రెండు దేశాల అభివృద్ధికీ ఈ పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలుస్తుంది" అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగానికి అడుగడుగునా ఆఫ్ఘన్ పార్లమెంట్ సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

  • Loading...

More Telugu News