: వాజపేయిని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలపనున్న మోదీ
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, కవి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ఇవాళ 91వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ఉన్న మోదీ నేడు స్వదేశానికి రాగానే విమానాశ్రయం నుంచి నేరుగా వాజపేయ ఇంటికి వెళతారని తెలిసింది. మరోవైపు వాజపేయి సేవలకు గుర్తింపుగా, జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పూర్వీకుల గ్రామం బటేశ్వర్ కు రైల్వేశాఖ సేవలను ప్రారంభించింది. రైల్వే సహాయమంత్రి మనోజ్ సిన్హా, మానవ వనరుల శాఖ సహాయమంత్రి, స్థానిక ఆగ్రా ఎంపీ రామ్ శంకర్ కతేరియా బటేశ్వర్ కు ప్రయాణికుల రవాణా రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు 16 ఏళ్ల కిందట అద్వాణీ శంకుస్థాపన చేయగా, నిన్న(గురువారం) రైలు పట్టాలెక్కింది.