: తిట్టుకున్న 'దీదీ' మంత్రులు... మాల్దాలో బహిరంగంగా వాదులాటకు దిగిన వైనం


క్రిష్ణేందు నారాయన్ చౌదరి, సావిత్రి మిత్రా... ఇద్దరూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అంతేకాదు, వారిద్దరూ తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కేబినెట్ లో మంత్రులు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్న చౌదరి మాల్దా పరిధిలోని ఇంగ్లీష్ బజార్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సావిత్రి మిత్రా కేబినెట్ లో మంత్రిగా ఉన్నా ఆమెకు ఇప్పటిదాకా ఏ శాఖ కూడా చేతికందలేదు. అయితే చౌదరి నియోజకవర్గ పరిధిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె అక్కడి వారికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చౌదరికి తెలపడంలో అటు మిత్రా గాని, అధికారులు గాని ఆసక్తి చూపలేదు. ఓ వైపు కార్యక్రమం ప్రారంభమైపోయింది. మిత్రాతో పాటు అధికారులు కూడా వేదిక ఎక్కారు. మరికాసేపట్లో పట్టాల పంపిణీ కూడా పూర్తయ్యేదే. అయితే సమాచారం తెలుసుకున్న చౌదరి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పరుగు పరుగున కార్యక్రమం వద్దకు వచ్చారు. వచ్చీ రావడంతోనే నేరుగా వేదిక మీదకు వచ్చి మిత్రాతో వాగ్వాదానికి దిగారు. తనకు తెలియకుండా, తన నియోజకవర్గంలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ మహిళా మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తానేమీ తక్కువ తినలేదన్నట్లు మిత్రా కూడా చౌదరికి దీటుగానే సమాధానం ఇచ్చారు. ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదంటూ ఎదురు సమాధానమిచ్చారు. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న గొడవతో షాక్ తిన్న అధికారులు పట్టాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయినా మంత్రులిద్దరూ చాలాసేపు ఒకరిపై మరొకరు పరుష పదజాలంతో దూషించుకున్నారు. బహిరంగంగా వీరి మధ్య చోటుచేసుకున్న గొడవ దృశ్యాలు జాతీయ వార్తా చానెళ్లలో హల్ చల్ చేశాయి. మరో ఆసక్తికర విషయమేంటంటే, పూర్వాశ్రమంలో వీరిద్దరూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన వారేనట. 2011లో మిత్రా తృణమూల్ లో చేరగా, చౌదరి ఓ ఏడాది ఆలస్యంగా 2012లో దీదీ జట్టులో చేరిపోయారు.

  • Loading...

More Telugu News