: రోబోలు వార్తలు చదువుతుంటే... యాంకర్ల గుండెల్లో గుబులు!
చైనాలో వివిధ టెలివిజన్ చానళ్లలో వార్తలు చదువుతూ, వ్యాఖ్యానాలు వినిపిస్తున్న యాంకర్లలో కొత్త గుబులు మొదలైంది. కారణం ఏంటో తెలుసా? 'సియావో ఐస్' అనే రోబో వారికి పోటీగా వచ్చి చేరడమే! తడుముకోకుండా, మంచి హావభావాలు పలికిస్తూ, స్పష్టంగా రోబో వార్తలు వినిపిస్తుంటే, చూసేవారు కళ్లప్పగించి చూస్తుండి పోతున్నారట. ఇక తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని మామూలు యాంకర్లలో గగ్గోలు మొదలైంది. మైక్రోసాఫ్ట్ అందించిన సాఫ్ట్ వేర్ టెక్నాలజీతో ఈ రోబో ప్రస్తుతం షాంగై డ్రాగన్ టీవీలో బ్రేక్ ఫాస్ట్ న్యూస్ చదువుతోంది. ఈ రోబో చదివే వార్తలను వినేందుకు ప్రజలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. కాగా, సాధారణ యాంకర్లను తొలగించే ఉద్దేశం తమకు లేదని షాంగై మీడియా గ్రూప్ యాజమాన్యం చెబుతుండటంతో, యాంకరింగ్ ఉపాధిగా ఉన్న యువతీ, యువకులు కొంత ఊరట చెందుతున్నారు.