: రూ. 13 వేల కోట్ల విలువైన యమునా ఎక్స్ ప్రెస్ వే అమ్మకానికి!


అది ఢిల్లీ - ఆగ్రాలను కలిపే ఆరు లైన్ల రహదారి. మొత్తం 165 కి.మీ పొడవైన ఎక్స్ ప్రెస్ వే. రోడ్డెక్కితే ఎక్కడా ఆగకుండా రెండు గంటల్లోపే గమ్యస్థానానికి చేరిపోవచ్చు. ఆగస్టు 2012లో జాతికి అంకితమైన ఈ రహదారిని జైపీ గ్రూప్ నిర్మించింది. ఇప్పుడీ రహదారి విలువ రూ. 13 వేల కోట్లన్న అంచనాలుండగా, దీన్ని విక్రయించాలని జైపీ గ్రూప్ భావిస్తోంది. జై ప్రకాష్ పవర్ వెంచర్స్, జై ప్రకాష్ అసోసియేట్స్, జై ప్రకాష్ ఇన్ఫ్రాటెక్ తదితర సంస్థలను నిర్వహిస్తున్న గ్రూప్ ప్రస్తుతం రూ. 60 వేల కోట్లకు పైగా రుణాలను వివిధ బ్యాంకులకు చెల్లించాల్సి వుండగా, దాన్ని కొంతమేరకైనా తగ్గించుకునేందుకు ఈ రహదారిని విక్రయించాలని సంస్థ భావిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, ఈ ప్రాజెక్టు అమ్మకం అనుకున్నంత సులువు కాదని బ్రోకరేజి సంస్థ మేబ్యాంక్ అభిప్రాయపడింది. ఈ రహదారి వెంట ఐదు ప్రాంతాల్లో జేపీ సంస్థ భూములను పొంది టౌన్ షిప్ లను నిర్మిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. వాస్తవానికి యమునా ఎక్స్ ప్రెస్ వేపై టోల్ రూపంలో వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం, రహదారి నిర్మాణానికి వెచ్చించిన నిధులపై వడ్డీని కూడా ఇవ్వడం లేదని సమాచారం. యమునా ఎక్స్ ప్రెస్ వేను విక్రయిస్తున్నట్టు 'ది మింట్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, దీనిపై స్పందించేందుకు జైపీ గ్రూప్ ప్రతినిధులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News