: ఆ దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయో తెలియదు: కోడెల


అసెంబ్లీలో జరిగిన గలాటాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి ఎలా ప్రవేశించాయో తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఈ పని ఎవరు చేసినా తప్పేనని, దీనిపై ఇంకా విచారణకు ఆదేశించలేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో దృశ్యాలు వచ్చిన తరువాతనే సీడీలను కావాలని వివిధ పక్షాలు కోరిన మీదట, తన ప్రమేయం లేకుండానే విప్ కాల్వ శ్రీనివాసులు వాటిని విడుదల చేశారని స్పష్టం చేశారు. వాటిని బహిర్గతం చేయమని కానీ, చేయవద్దని కానీ తాను ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదని అన్నారు. గత 35 సంవత్సరాలుగా తానెన్నడూ అసెంబ్లీలో చూడని పరిస్థితి ఇప్పుడు ఎదురవుతోందని, అందుకు చాలా చింతిస్తున్నానని అన్నారు. విడుదల చేయకుండానే బయటకు వచ్చిన దృశ్యాల ఉదంతంపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సభ మొత్తాన్నీ అడ్డుకోవడం వైకాపాకు సమంజసం కాదని హితవు పలికారు. పలుమార్లు హెచ్చరించినా, వినకపోవడంతోనే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. జరిగిన ఘటనలను ప్రజలంతా చూశారని అన్నారు. ఏ పార్టీ అయినా, తమ ప్రవర్తనపై స్వయంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఆ దృశ్యాలు ఎలా సోషల్ మీడియాలోకి వచ్చాయన్న దానిపై విచారణకు ఆదేశించే అంశమై ఆలోచిస్తున్నామని కోడెల తెలిపారు. ఆపై రోజాపై ఒక సంవత్సరం సస్పెన్షన్ అంశంపైనా చర్చించేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్టు తెలియజేశారు. మూడు పార్టీల సభ్యులూ కమిటీలో ఉంటారని, వారు ఆలోచించి ఇచ్చే సిఫార్సులను బట్టి తన నిర్ణయం ఉంటుందని వివరించారు. తాను సభాపతిగా ఉన్నంతకాలం, ఎవరు హద్దులు మీరినా ఊరుకోబోనని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News