: ఎంతకాలం జీవిస్తామో మన లాలాజలం చెప్పేస్తుంది!


మానవుడి మరణం అత్యంత రహస్యం. ఎప్పుడు మరణం సంభవిస్తుందన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరు. అయితే, నోటిలోని లాలాజలం ఈ రహస్యాన్ని విప్పేస్తుందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ కు చెందిన రీసెర్చర్ల బృందం ఈ విషయాన్ని తమ పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చింది. లాలాజలాన్ని పరీక్షిస్తే, తెల్ల రక్తకణాల్లో రహస్యంగా దాగుండే యాంటీ బాడీస్ గురించిన సమాచారం తెలుస్తోందని వీరు తేల్చారు. శరీరంలోని రోగాలతో ఎంతవరకూ పోరాడగలరన్న విషయాన్ని మరింత సులువుగా తెలుసుకోవచ్చని, తద్వారా ఆయుర్దాయం ఎంతన్న విషయమై అంచనాకు రావచ్చని వారు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ మినహా, మిగతా క్యాన్సర్లు కలిగివున్న వారు ఇంకెంత కాలం జీవిస్తారన్న విషయమై ఈ రీసెర్చ్ అతి దగ్గరి ఫలితాలను వెల్లడించిందని వర్శిటీ ప్రతినిధి అన్నా ఫిలిప్స్ వెల్లడించారు. పెరిగే వయస్సు, వచ్చే రోగాలపై నియంత్రణ లేకపోయినా, ఒత్తిడి స్థాయులు, తీసుకునే ఆహారం, వ్యాయామం, మద్యం, ధూమపానం వంటి ఎన్నో సానుకూల, వ్యతిరేక అంశాలు మరణానికి దగ్గర చేసే స్థాయులపై ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. తాము మొత్తం 639 మంది పెద్దలను రీసెర్చ్ లో భాగం చేసి ఎప్పటికప్పుడు వారి లాలాజలాన్ని పరీక్షిస్తూ, ఈ అధ్యయనం చేసినట్టు వివరించారు. ఈ అధ్యయనం గురించిన పూర్తి సమాచారం 'ప్లాస్ వన్' జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News