: పెరిగిపోతున్న క్యూ, నిండుకుంటున్న ఏటీఎంలు!
పలు రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో నాలుగు వరుస సెలవులు రావడం, సోమవారం దాకా ఏటీఎంలలో నగదు నింపే అవకాశాలు లేకపోవడంతో, దేశవ్యాప్తంగా ఏటీఎంల ముందు ప్రజలు క్యూ కట్టారు. అన్ని ఏటీఎంలలో నిన్ననే పూర్తిగా డబ్బు నింపినప్పటికీ, ఈ నాలుగు రోజుల అవసరాల నిమిత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునే వారితో ఏటీఎంల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నేడు మిలాడి నబీ, రేపు క్రిస్మస్, ఆపై నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రాగా, తిరిగి సోమవారమే బ్యాంకులు తెరచుకోనున్నాయి. ఇండియాలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ నాలుగు రోజుల పాటూ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణంగా ఏ ప్రధాన ప్రాంతంలోని ఏటీఎంలలో అయినా, పూర్తిగా నగదు నింపితే, అది రెండు రోజుల్లోనే ఖాళీ అయిపోతుంటుంది. ఇక వరుస సెలవులు వస్తే, మరింత త్వరగా డబ్బు నిండుకుంటుంది. ఇక అత్యవసరంగా నగదు అవసరమయ్యే వారు రూ. 20 అదనంగా చెల్లించి (ఇతర బ్యాంకుల నుంచి మూడు సార్లు డబ్బు తీసుకుంటే), అంతగా పేరులేని బ్యాంకుల ఏటీఎంలను ఆశ్రయించవచ్చని సలహా. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం శనివారం నాడు ఏటీఎంలలో నగదు నింపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించాయి. కాగా, దేశంలోని అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్ వంటి అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో ఏటీఎంలలో నగదు రద్దీని బట్టి రేపటిలోగా అయిపోయే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాల వరకూ పరిస్థితి కొంత నయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిలాడి నబీ పండగకు బ్యాంకుల సెలవు లేదు. దీంతో మూడు వరుస రోజులు మాత్రమే బ్యాంకులు మూతపడనున్నాయి. మిలాడి నబీ సందర్భంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఢిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.