: మోదీ నిజంగానే జాతిని అవమానించారా?
జాతీయగీతం వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ, వేదిక నుంచి వెళ్లిపోతూ జాతిని అవమానించారని నిన్నటి నుంచి విమర్శలు వస్తున్న వేళ, ఇది అసంకల్పితంగా జరిగిన చిన్న ఘటన మాత్రమేనని, దీన్ని పెద్దదిగా చూపడం తగదని బీజేపీ వ్యాఖ్యానించింది. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే... మాస్కో విమానాశ్రయంలో నిన్న మోదీ కాలు మోపిన అనంతరం సైన్యం వందనాన్ని ఆయన స్వీకరించారు. ఆ సమయంలో ఓ రష్యా అధికారి తన చేతిని ఊపుతూ సైగ చేశారు. ఆ సైగను ఇక అక్కడి నుంచి కదలాలి అని భావించిన మోదీ అడుగు వేశారు. వాస్తవానికి ఆ సైగ భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా సైనిక బ్యాండు బృందానికి చేసినది కావడంతో పొరపాటు జరిగిపోయింది. మోదీ ముందడుగు వేయడం, 'జనగణమన...' అని గీతం ప్రారంభం కావడం జరిగిపోయాయి. ఆ వెంటనే ఓ రష్యా అధికారి మోదీని ఆపగా, విషయం అర్థమైన ఆయన కూడా వెనక్కు వచ్చి నిలబడిపోయారు. ఇదీ అక్కడ జరిగింది. జాతీయగీతం పాడుతున్న వేళ, మోదీ కదలడాన్ని రాజకీయ విపక్షాలు విమర్శిస్తుంటే, నెటిజన్లు మాత్రం పెద్దగా స్పందించక పోవడం గమనార్హం.