: ప్రముఖ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ ఇప్పుడు భారతీయుడు కాదు!
ప్రముఖ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. గోవాకు చెందిన ఆయన పోర్చుగీసు పౌరసత్వం తీసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, రెమో కుమారుడు కొద్ది రోజుల క్రితం కారును నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ బాలిక గాయపడింది. ఈ క్రమంలో, బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లిన రెమో... ఆమెను బెదిరించాడని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, కేసును విచారించడానికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. భారతీయ పౌరసత్వాన్ని రెమో వదులుకున్నాడని... పోర్చుగీసు పౌరసత్వం తీసుకున్నాడని వెల్లడైంది. అయితే, ఆయన పోర్చుగీసు పౌరసత్వం ఎప్పుడు తీసుకున్నాడన్న విషయం మాత్రం తెలియలేదని పోలీసులు తెలిపారు. దీంతో, ఇప్పుడు రెమోపై చర్యలు తీసుకోవాలంటే పోర్చుగీసు ఎంబసీ ద్వారా సమన్లు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు, ప్రస్తుతం రెమో ఫెర్నాండెజ్ యూరప్ పర్యటనలో ఉన్నారు.