: ఆ విద్యార్థులను అమెరికా నుంచి ఎందుకు తిప్పి పంపారంటే...!
అమెరికా, కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ (ఎస్ యూవీ), నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ (ఎన్ పీయూ) లలో జాయిన్ అయ్యేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపడంలో తమ తప్పిదం లేదని ఆయా వర్సిటీల అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అనుమతులు తీసుకునే సమయంలో అక్కడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారని, అందుకే వారిని తిప్పి పంపారని అన్నారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో చదువుకుంటూ అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తారా? అని అడిగితే, చేస్తామని విద్యార్థులు చెప్పారని, అలాగే అమెరికాలో విద్యనభ్యసించేందుకు సరిపడా ఆర్థిక స్తోమతను అధికారులకు చూపడంలో విఫలమయ్యారని, ఎంత మంది వచ్చారని సంధించిన ప్రశ్నకు, తాము 15 మందిమి వచ్చామని చెప్పడం కూడా వారిని తిరస్కరించడంలో కీలక పాత్ర పోషించాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. మనం ఏ దేశం వెళ్తున్నామో ఆ దేశ చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని, విద్య సమయంలో విద్యాభ్యాసం మాత్రమే చేస్తామని అధికారులకు వివరించాల్సిన బాధ్యత విద్యార్థిదేనని వారు పేర్కొన్నారు. అలాగే నిర్దేశిత విద్యాభ్యాసానికి సరిపడా ఆర్థిక స్తోమత ఉందని కూడా విద్యార్థి నిరూపించుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో విద్యాభ్యాసానికి ఎవరైనా ఒంటరిగా వెళ్తారు కానీ గుంపులుగా వెళ్లరన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని, ఆయా ప్రశ్నలకు సరిపడా సమాధానాలు చెప్పని కారణంగా మాత్రమే వారిని తిప్పిపంపారని ఆయా యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని వారు వివరించారు. తమ యూనివర్సిటీలు బ్లాక్ లిస్టులో లేవని వారు తెలిపారు.