: దావూద్ కారును నేడు బహిరంగంగా తగలబెట్టనున్న హిందూ మహాసభ అధ్యక్షుడు
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గతంలో వాడిన కారును నేటి మధ్యాహ్నం హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి బహిరంగంగా తగలబెట్టనున్నారు. ఈ నెల ప్రథమార్థంలో జరిగిన వేలంలో దావూద్ వాడిన హ్యూందాయ్ యాక్సెంట్ కారు (ఎంహెచ్ 04-ఏఎక్స్ 3676) ను రూ.32 వేలకు చక్రపాణి చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దావూద్ చర్యలను నిరసిస్తూ సదరు కారును తగలబెట్టేందుకే దానిని కొన్నానని వేలం సందర్భంగానే చక్రపాణి ప్రకటించారు. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ కు చెందిన ఇందిరాపురంలో కారును బహిరంగంగా తగలబెడుతున్నట్లు ఆయన తెలిపారు. దావూద్ దుశ్చర్యలకు, ఉగ్రవాదానికి దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చక్రపాణి పేర్కొన్నారు.