: 'నిర్భయ' స్థానంలో నా కూతురుంటే... నిందితుడిని కాల్చి చంపేవాడిని: తృణమూల్ ఎంపీ


రాజ్యసభలో జువనైల్ జస్టిస్ చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమస్యపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ బిల్లుకు మిగతా ఎంపీలంతా సహకరించాలని కోరారు. ఓ ఆదర్శ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ఎందుకు ఇంతకాలం ఎదురుచూడాలని ఒబ్రెయిన్ ప్రశ్నించారు. జువనైల్ జస్టిస్ బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందరూ ఒక్కటికావాలని విజ్ఞప్తి చేశారు. బాల నేరస్థుల శిక్షా కాలాన్ని పెంచాలని కూడా ఆయన కోరారు. ఇదే సమయంలో ఎంపీ డెరిక్ 'నిర్భయ' ఘటనపై స్పందిస్తూ, "ఆమె స్థానంలో నా కూతురు గనుక ఉండి ఉంటే నేనేం చేసేవాడిని? ఈ దేశంలోని చట్టాలను విశ్వసించేవాడినా? లేక దేశంలోని మంచి లాయర్లను పెట్టుకునేవాడినా? లేక గన్ తీసుకుని నిందితుడిని కాల్చేసేవాడినా? అని అడిగితే గన్ తీసుకుని నిందితుడిని కాల్చి చంపే వాడిని. ఏదేమైనా ఇదంతా ఓ భావోద్వేగ విషయం" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వెంటనే రాజ్యసభలోని ఓ సభ్యుడు లేచి 'మీరో పార్లమెంట్ మెంబర్' అంటూ గుర్తు చేశారు. ఇందుకు కూడా స్పందించిన డెరిక్, తనను తప్పుగా తీసుకోవద్దని, తనను తాను వ్యక్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అంతేగానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదన్నారు. కేవలం తానొక తండ్రిలా ఏం చేస్తానో అదే చెప్పానని వివరించారు.

  • Loading...

More Telugu News