: ఇక మోదీ జాకెట్!... దేశ విదేశాల్లోనూ క్రేజ్ పెరుగుతోందన్న కేంద్ర మంత్రి
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ధరించిన కోటుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వుంది. నలుపు, నీలం రంగుల్లోనే కాక మరిన్ని లైట్ కలర్లలో కనిపించే ఆ కోట్లు గులాబీ పువ్వుతో మెరిసిపోయేవి. ఫుల్ హ్యండ్స్ తో ఉండే సదరు కోటుకు ‘జవహర్ జాకెట్’గా పేరు పడిపోయింది. ఇక నెహ్రూ తర్వాత ఆ స్థాయిలో వస్త్రధారణలో పాప్యులర్ అయిన భారత ప్రధాని దాదాపుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి. ఇన్నేళ్లకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కోటుకు మళ్లీ పాప్యులారిటీ పెరిగింది. చేతుల్లేకుండా స్లీవ్ లెస్ గా కనిపించే మోదీ కోటుకు దేశంలోనే కాక విదేశాల్లోనూ ప్రాచుర్యం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఏ సర్వే సంస్థనో చెప్పలేదు సుమా. సాక్షాత్తు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మోదీ జాకెట్’ గా ప్రాచుర్యం పొందుతున్న ఈ కోటు వేసుకునేందుకు భారత్ లోనే కాక, పలు దేశాలకు చెందిన నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారని నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మిశ్రా పేర్కొన్నారు. జపాన్ ప్రధాని షింజో అబే ఏకంగా మోదీ జాకెట్ ను ధరించారని కూడా ఆయన చెప్పారు. మోదీ జాకెట్ కు పెరుగుతున్న పాప్యులారిటీని దృష్టిలో పెట్టుకుని ఖాదీ వినియోగాన్ని మరింత పెంచేలా చర్యలు చేపడుతున్నామని మిశ్రా చెప్పుకొచ్చారు.