: ప్రజల మనసు తెలుసు... కానీ మా చేతులు కట్టేసి ఉన్నాయి, ఏమీ చేయలేం: 'నిర్భయ' బాల నేరస్తుడి కేసులో సుప్రీం
ఏ నిర్ణయం తీసుకున్నా చట్టానికి కట్టుబడే ఉండాలని, చట్టాన్ని మీరడం పౌరుల ధర్మం కాదని నిర్భయ ఘటనలో మూడేళ్ల శిక్షను అనుభవించిన జువైనల్ విడుదలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తమకు తెలుసునని, అయితే, తమ చేతులు కట్టేసి ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) వేసిన పిటిషన్ పై విచారణ జరుగగా, "మీ అభిప్రాయాలను విన్నాం. బాల నేరస్తులను మూడేళ్లకు మించి జైల్లో ఉంచే చట్టమేదీ ఇండియాలో లేదు. ఇప్పుడున్న చట్ట నిబంధనల ప్రకారం, ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేమున్నాం" అని వ్యాఖ్యానించారు. డీసీడబ్ల్యూ తరఫున సీనియర్ న్యాయవాది గురు క్రిష్ణకుమార్, దేవదత్త కామత్ లు వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పుపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ, ఈ తీర్పు భారత మహిళలకు ఓ చీకటి రోజును గుర్తు చేస్తోందని అన్నారు. అతని ప్రవర్తన, ఆపై పోలీసులు ప్రత్యేక హోంకు తరలించడం వంటివి చూస్తుంటే, అతను ఇంకా మహిళలకు ప్రమాదకరమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అతను సంఘానికి ప్రమాదంగా మారకముందే చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, 2012లో నిర్భయ (జ్యోతి సింగ్)పై అత్యాచారం జరిగిన వేళ, నిందితుడు బాల నేరస్తుడు. దీంతో ఈ కేసులో అతనికి కఠిన శిక్ష విధించే అవకాశాలు లేకుండా పోయాయి.