: పోలీసు దాడులనూ వెరవక, కాల్ మనీ వ్యాపారి దౌర్జన్యం!
ఓ వైపు కాల్ మనీ వ్యాపారాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని చెబుతూ, పోలీసులు దాడులు నిర్వహిస్తుండగా, ముందుగా అనుకున్న ప్రకారం 10 రూపాయల వడ్డీ ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళను చంటిబిడ్డ సహా ఇంటి నుంచి గెంటివేసి సామాన్లు బయట పడవేయించాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. బాధితుల కథనం ప్రకారం, వడ్డీ వ్యాపారి తానికొండ మాధవ నుంచి రూ. 30 వేలు అప్పుగా తీసుకుని ఇప్పటికే వడ్డీల రూపంలో రూ. 50 వేల వరకూ చెల్లించారు. గత రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో వడ్డీ చెల్లించడం ఆలస్యం కాగా, ఈ ఉదయం మాధవ కొందరు రౌడీలతో కలసి బాధితుల ఇంటిపై దాడి చేశాడు. పది రూపాయల వడ్డీ ఇచ్చి తీరాలని, రూ. 30 వేల అప్పు తీర్చేందుకు లక్షకు పైగా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు వాపోయారు. ఈ విషయంలో ఇంకా పోలీసు కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.