: ఎందరు వీఐపీలు వచ్చినా సామాన్యులకే పెద్దపీట: టీటీడీ
పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ ఉదయం 10 గంటల నుంచి భక్తులను క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని నారాయణగిరి ఉద్యానవనంలో 9 తాత్కాలిక కంపార్టుమెంట్లను ప్రత్యేకంగా నిర్మించామని వివరించారు. అన్ని రకాల వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించబోమని, ఒకవేళ వీఐపీలే వస్తే గరిష్ఠంగా నాలుగు టికెట్లు మాత్రమే ఇస్తామని వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, నేటి రాత్రి ఒంటిగంట తరువాత తిరుప్పావై ప్రవచనాల అనంతరం వైకుంఠ ద్వారాలను తెరుస్తామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని, క్యూలైన్లలో నిరంతరం అన్నపానీయాలు అందిస్తామని వివరించారు. కాగా, రేపటి వైకుంఠ ఏకాదశినాడు దర్శనం నిమిత్తం తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.