: చట్టాన్ని అనుసరిస్తాం...బెదిరేది లేదు: రాహుల్
తామెవరికీ తల వంచేది లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ముందు విచారణకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతోందన్న కక్షతో కొంత మంది తమను వేధిస్తున్నారని, అలాంటి చర్యలకు వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ తాము ప్రతిపక్ష ధర్మాన్ని విడిచిపెట్టేది మాత్రం లేదని, ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడతామని ఆయన తెలిపారు. ఎవరు ఎలాంటి వేధింపులకు పాల్పడినా ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు. చట్టం అంటే తమకు గౌరవం ఉందని, చట్టాన్ని అనుసరిస్తామని ఆయన తెలిపారు.