: అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా లేదు... జగన్ కు తేల్చిచెప్పిన యనమల
చట్టసభలు తీసుకునే నిర్ణయాలను కోర్టులు కూడా ప్రశ్నించజాలవని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై నేటి అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఓ సభ్యురాలిని ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా కల్పించుకున్న యనమల అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కూడా ప్రశ్నించజాలవని తేల్చిచెప్పారు. సభా నియమాల మేరకే అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై సస్పెన్షన్ వేటు వేశామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము నిబంధనలను అతిక్రమించలేదని పేర్కొన్నారు.