: అమెరికాలో ముస్లింలపై మూడు రెట్లు పెరిగిన దాడులు
అమెరికాలో ముస్లింలపై దాడులు మూడు రెట్లు పెరిగిపోయాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చ్ గ్రూప్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇటీవల పారిస్, శాన్ బెర్నార్డినోల్లో విద్వేషపూరిత ఉగ్రవాద దాడుల నేపథ్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా దాడులు సరాసరిగా నెలకు 12గా నమోదయ్యాయని, పారిస్ ఉగ్రవాద దాడుల తరువాత ఈ సంఖ్య 38గా నమోదైందని వర్సిటీ నివేదిక తెలిపింది. ఇటీవల అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ముస్లింలను అమెరికాలోకి రాకుండా చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం అమెరికాలోని ముస్లింలను కలవరపరుస్తోంది.