: కాల్ మనీపై శాసనసభలో చంద్రబాబు ప్రకటన... నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం
ఏపీలో గత కొన్ని రోజుల నుంచి కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఇవాళ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై శాసనసభలో చర్చ ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ వ్యవహారంలో వైసీపీ సభ్యులు 65 మంది, టీడీపీ నుంచి 20, కాంగ్రెస్ 12, సీపీఐ 6, సీపీఎం 1, బీజేపీ 4, లోక్ సత్తాకు చెందిన వారు ఇద్దరున్నారని వెల్లడించారు. 78 మంది ఎలాంటి పార్టీకి చెందని వారున్నారని తెలిపారు. కాల్ మనీపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్భయ చట్టం కింద కేసు పరిష్కారం కోసం విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ సభ్యుల గుట్టు రట్టు అవుతున్నందునే ఆ పార్టీ సభ్యులు సభ జరగకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధిక వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడానికి చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.