: మదర్ థెరీసా రెండవ అద్భుతాన్ని గుర్తించిన పోప్
దివంగత మదర్ థెరీసా చూపిన రెండవ మహిమను పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారని ఇటాలియన్ కాథలిక్ దినపత్రిక 'అవినీర్' వెల్లడించింది. దీంతో మదర్ కు వచ్చే సంవత్సరం 'సెయింట్' హోదాను ఇచ్చేందుకు మార్గం సుగమమైందని పత్రిక వెల్లడించింది. బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వ్యక్తికి మెదడులోని కణితుల వల్ల ఏర్పడిన జబ్బును మదర్ థెరీసా నయం చేశారని తెలిపింది. కాగా, 1997లో 87 సంవత్సరాల వయసులో మదర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత 2003లో అప్పటి వాటికన్ పోప్ జాన్ పాల్-2 ఆమెను పవిత్రురాలిగా ప్రకటించారు. అంతకు ఏడాది ముందు మదర్ మహిమతో తన కడుపులోని వ్యాధి నయమైందని మోనికా బేస్రా అనే యువతి ప్రకటించగా, దాన్ని తొలి అద్భుతంగా వాటికన్ పేర్కొంది. మదర్ కు సంబంధించిన మరో అద్భుతాన్ని గుర్తించిన తరువాతనే సెయింట్ హోదాను ఇవ్వాల్సి వుండగా, ఇప్పుడు ఆ లాంఛనం కూడా పూర్తయింది.