: ప్రకటన కంటే ముందుగా చర్చకు జగన్ పట్టు... కుదరదన్న యనమల... సభ వాయిదా


కాల్ మనీ వ్యవహారంపై చర్చకు, ప్రకటనకు అటు అధికార పక్షం టీడీపీతో పాటు ఇటు విపక్షం వైసీపీ కూడా సిద్ధమే. అయితే ముందు ఏది జరగాలన్న దానిపై ఇరుపక్షాల మధ్య విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలుత చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వ ప్రకటన ఉండాలని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదించారు. అలా కాకుండా ముందుగా ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చకు అవకాశం ఏముంటుందని కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కాల్ మనీపై కేవలం పది నిమిషాల్లోనే చర్చను ముగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వాదనను తిప్పికొట్టిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తాము మాత్రం ముందుగా ప్రకటనకే కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత చర్చకు ఇబ్బందేమిటని కూడా యనమల ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రారంభమైన పావు గంటకే సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News