: పూణే పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇంటర్ బాలిక!... ఐఎస్ తో లింకులే కారణం!
నిండా పదహారేళ్లు కూడా లేని ఓ బాలిక మహారాష్ట్రలోని పూణే పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నగరంలోని ఓ సంపన్న ముస్లిం కుటుంబానికి చెందిన ఆ బాలిక ప్రస్తుతం అక్కడి ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తన ఫేస్ బుక్ ఖాతాలో 200 మంది ఫ్రెండ్స్ ను కలిగిన ఆ బాలికను గుర్తించేందుకు పూణే ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు రోజుల తరబడి ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు ఆ బాలికను గుర్తించగలిగిన పోలీసులు వాస్తవాలు తెలుసుకుని షాక్ కు గురయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన తల్లిదండ్రులకు గాని, విద్యాబుద్ధులు నేర్పుతున్న తన ఉపాధ్యాయులకు గాని తెలియకుండా ఆ బాలిక... ఐఎస్ సానుభూతిపరులతో నిత్యం టచ్ లో ఉంటోందట. రోజూ సోషల్ మీడియా ద్వారా ఐఎస్ సింపథైజర్స్ తో చర్చలు సాగిస్తున్న ఆ బాలిక, త్వరలోనే సిరియాకు గాని, ఇరాక్ కు గాని పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుందట. ఇక పదహారేళ్ల చిరుప్రాయంలోనే తమవైపు ఆకర్షితురాలైన ఆ బాలికకు, ఎంబీబీఎస్ సహా ఏ కోర్సు చదివేందుకైనా సహాయం చేసేందుకు ఐఎస్ ఉగ్రవాదులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గతవారం ఐఎస్ సానుభూతిపరుల నెట్ వర్క్ ను ఏర్పాటు చేశాడన్న ఆరోపణలపై అరెస్టైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి అరెస్టుతో ఈ బాలిక ఉదంతం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలికను ఐఎస్ ఉగ్ర వలయం నుంచి బయట పడేసేందుకు ఆమె తల్లిదండ్రుల సాయం కూడా తీసుకుంటున్నట్టు పూణే ఏటీఎస్ చీఫ్ భాను ప్రతాప్ బర్గే చెప్పారు.