: మాట మార్చిన నితీశ్ సర్కారు... బీహార్ లో మద్యం షాపులకు టెండర్ల ఆహ్వానం
మొన్నటి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చి, ఘన విజయం సాధించిన నితీశ్ కుమార్ సీఎం పదవి చేపట్టగానే, రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన కొన్ని రోజుల పాటు కూడా నిలబడలేదు. పాక్షిక మద్యనిషేధంపైనే నితీశ్ మాట్లాడారని, మీడియానే సంపూర్ణ మద్యనిషేధమని ప్రచారం చేసిందని బీహార్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఆ తర్వాత చెప్పుకొచ్చింది. తాజాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) విక్రయ కేంద్రాలకు టెండర్లను ఆహ్వానిస్తూ ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాలను నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం కోరింది.