: ప్రభుత్వోద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి: పరేష్ రావల్


ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపితేనే దేశ విద్యావ్యవస్థ మారుతుందని సినీ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ స్పష్టం చేశారు. పార్లమెంటులోని జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలోని విద్యావ్యవస్థలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు విద్యా ఉగ్రవాదంలా తయారయ్యాయని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు పూర్తి వ్యవస్థీకృతంగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సంబంధాలు పెట్టుకుని పరీక్షలను ప్రభావితం చేసే స్థాయికి ప్రైవేటు విద్యావ్యవస్థ చేరుకుందని ఆయన పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల వెంట పరుగులు తీస్తున్నారని, అక్కడ పిల్లలకు పాఠాలు బోధించేది ప్రభుత్వ ఉపాధ్యాయులేనని ఆయన తెలిపారు. దీంతో ఉగ్రవాదుల్లానే వీటిపై కూడా ఎలాంటి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండడం లేదని ఆయన అన్నారు. వీటిని పరిశీలించేందుకు, తనిఖీలు నిర్వహించేందుకు వ్యవస్థ కూడా లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలంటే ప్రభుత్వోద్యోగులు తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News