: ఎల్లుండి కోర్టుకు సోనియా, రాహుల్... జైలుకా? ఇంటికా?


పాతకాల దినపత్రిక నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను అప్పనంగా దోచుకున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులో శనివారం నాడు కోర్టుకు హాజరుకానున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పోలీసు అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తే, బెయిలుకు దరఖాస్తు చేయరాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కేసును మోదీ సర్కారు రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వాడుకుంటోందని ఇప్పటికే వీరిరువురూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక కోర్టుకు వెళ్లే వీరు తిరిగి ఇంటికి వస్తారా? జైలుకు వెళతారా? అన్న విషయమై కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మోదీ సర్కారు విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ లు తమ అనుచరగణం వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో మరో రెండు రాష్ట్రాలు విచారణలో భాగం పంచుకోనున్నాయి. తాజాగా, ఏజేఎల్ (అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్) కు గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో ఇచ్చిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు వాడుతున్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ ప్రారంభించాయి. ముంబైలో కాంగ్రెస్ భవన్ పేరిట ఉన్న 11 అంతస్తుల భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. ఇక భోపాల్ లో నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణకు అప్పగించిన ఎకరం భూమిలో ఇప్పుడు ఓ భారీ మాల్ ఉంది. దీనిపైనా విచారణ మొదలైంది.

  • Loading...

More Telugu News