: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్... కెమెరాలకు అడ్డు నిలబడటమే కారణం!
ఏపీలో కలకలం రేపుతున్న కాల్ మనీ దందా ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఇద్దరు విపక్ష సభ్యుల సస్పెన్షన్ కూ కారణమైంది. నేటి ఉదయం ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో కాల్ మనీ దందాపై చర్చకు అనుమతించాలని విపక్ష వైసీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ అందించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. సభలో పెద్ద పెట్టున నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభా ప్రత్యక్ష ప్రసారాలను కూడా అడ్డుకున్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రామలింగేశ్వర రావు అలియాస్ రాజా(తుని), శివప్రసాదరెడ్డి (ప్రొద్దుటూరు)లు వీడియో కెమెరాలకు అడ్డుగా నిలబడ్డారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా వారు పక్కకు కదల్లేదు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వారిద్దరినీ ఒక రోజు సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. దీంతో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ వారిద్దరినీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.