: ‘కఠారి’ హత్య కేసులో మరో సంచలనం... సీకే బాబు అనుచరుడు, కార్పొరేటర్ ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త, టీడీపీ కీలక నేత కఠారి మోహన్ హత్య కేసులో మరో సంచలన ఘటన నమోదైంది. కఠారి మోహన్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి (సీకే బాబు) అనుచరుడు, నగరంలోని 38 వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు, కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ లొంగిపోయాడు. హత్యలు తానే చేశానని కూడా అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉందంటూ శివప్రసాద్ రెడ్డిని నిన్న పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు రాత్రంతా స్టేషన్ లో ఉంచి విచారించారు. నేటి ఉదయం ఆయనను పోలీసులు వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాగానే తీవ్ర మనోవేదనకు గురైన శివప్రసాద్ రెడ్డి ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.